ఇది ఒక ఇంటి కథ. ఆ ఇంట్లో ఒక నాన్న ఉంటాడు. అచ్చంగా ఆ నాన్నలాగే తయారైన ఒక పెద్ద కూతురు ఉంటుంది.
ఆ కూతురు రెండు నెలల తర్వాత రాక రాక ఇంటికి వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. నాన్నతో కూర్చొని మాట్లాడుతోంది. తను ఇన్ని రోజులు తిరిగిన దేశాల గురించి, చూసినవాటి గురించి, జరిగిన ముచ్చట్ల గురించి చెబుతోంది.
అమ్మ అడిగింది, “ఏం తింటావు?”
“పోహా!” అని చెప్పింది. తనకి అదంటే ఎంతో ఇష్టం.
ఏదో ఒక కథ చెబుతుంటే నాన్న తన మాటలు వినడం లేదు. “నాన్నా, నువ్వెందుకు వినట్లేదు?” అని మెల్లిగా కసిరింది.
అంతే. అరవై దాటిన నాన్నకి కోపం వచ్చింది. “మీరు చెప్పినట్టే నేను అన్నీ చేస్తూ ఉండాలా?” అని అలిగి తన గదిలోకి వెళ్లిపోయాడు.
అదేమీ పెద్ద గొడవ కూడా కాదు. కానీ కొన్ని మాటలు మనసుకి తగిలితే, వాటికి గొడవ పరిమాణంతో సంబంధం ఉండదు. నాన్న వెళ్లిపోయాక అమ్మ కూతురి పక్కన కూర్చుంది. ఆమె కథలు వింటూ ఉంది. కూతురు కూడా అమ్మకి తన ప్రయాణాలన్నీ చెబుతూ ఉంది. కానీ ఆమె మనసంతా నాన్న గదివైపే ఉంది.
కాసేపటికి వెళ్లి నాన్నతో మాట్లాడదామని చూసింది.
“రాకు. నాతో మాట్లాడకు,” అని ఆయన కసిరాడు.
అంతే. “నేనేం చేశాను నాన్నా? ఏమైనా తప్పు చేశానా? నాతో కాసేపు కూర్చొని మాట్లాడమనే కదా అడిగాను.”
మాట మాట పెరిగింది. చివరికి ఆ పిల్ల మనసు బాగా నొచ్చుకుంది. “రాక రాక ఇంటికి వస్తే… చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసేశారు.” అని అనుకుంది.
అమ్మ వీరి గొడవ మధ్యలో దూరలేదు. తనకి తెలుసు, ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవని.
తను వెళ్లి చక్కగా కూరగాయలు, ఉల్లిపాయలు, పల్లీలు వేసి, కూతురికి నచ్చేలా పోహా చేసింది. కానీ నాన్నతో జరిగిన గొడవ తర్వాత ఆ పిల్లకి తినబుద్ధి కాలేదు.
“నేను తినను.”
“ఎందుకు?” అడిగింది అమ్మ.
“నాన్న వచ్చి నాకు ప్లేట్ ఇస్తేనే తింటాను,” అని మొండిగా ఆ పిల్ల చెప్పింది.
అది ఆకలి లేక కాదు. ఆమెకి నాన్న కావాలి. నాన్న వచ్చి మాట్లాడాలి. నాన్న వచ్చి తనకి తినిపించాలి. తన మీదున్న కోపం కంటే తన మీదున్న ప్రేమ పెద్దదని ఒక చిన్న సంకేతం ఇవ్వాలి.
కానీ నాన్నకి పంతం. కూతురికి కూడా పంతమే. ఆ పంతాల మధ్య సమయం తొమ్మిదైంది. పదైంది. పదకొండైంది.
అమ్మ తినేసింది. తమ్ముడు తినేశాడు. నాన్న అయితే అందరికంటే ముందే తినేశాడు. కానీ ఆ పిల్ల మాత్రం కదల్లేదు.
మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. అంతకుముందు రెండు రోజులుగా విమాన ప్రయాణాల్లోనే ఉంది. శరీరానికి అలసట. కడుపులో ఆకలి. అదే సమయంలో పీరియడ్స్ కూడా వచ్చాయి. ఇంకా చిరాకు. ఇంకా బాధ. ఇంకా ఆకలి.
అయినా, “నాన్న వచ్చి ఇచ్చేదాకా తినను.” అని మొండిగా కూర్చుంది.
ఆ రోజు చేసుకోవాల్సిన రెండు మూడు పనులు ఉన్నాయి. ల్యాప్టాప్ తెరిచి పని మొదలుపెట్టింది. ఆకలేస్తోంది. కానీ తినదు. ఎందుకంటే పంతం.
సమయం పన్నెండు దాటిపోయింది. అందరు పడుకునేశారు.
ఆ పిల్లకి ఒక్కసారిగా దేవుడు గుర్తొచ్చాడు. “దేవుడా…”
నాన్నకి తనంటే ఎంత ప్రేమో తెలుసు. తన కోసం ఎంత ఎదురుచూశాడో తెలుసు. కానీ ఆ నాన్న పంతం కూడా తెలుసు.
అందుకే దేవుణ్ణి అడిగింది, “నాకు ఇంత ఆకలేస్తున్నప్పుడు… నాన్న వచ్చి నాకు ఒక ప్లేట్ పెట్టేంత చిన్న ప్రేమ కూడా ఎందుకు ఇవ్వలేకపోయావు? నేను ఖాళీ కడుపుతో పడుకుంటాను కదా ఈ రోజు,” అని బాధపడుతూ తన పని చేసుకుంటూ కూర్చుంది.
ఇంతలో తన తలుపు బయట ఒక చప్పుడైంది. ఎవరా అని అనుకునే లోపే, తలుపు తట్టి లోపలికి అమ్మ మెల్లిగా వచ్చింది.
“సమయం చాలా దాటిపోయింది. నువ్వింకా తినలేదు. నాకు నిద్ర పట్టలేదు. మనసు కుదుటపడట్లేదు. నువ్వు తినాలి,” అని దగ్గరకి తీసుకొని ఆ పిల్ల తల నిమిరింది.
అమ్మ కిచెన్లోకి వెళ్లింది. కొద్దిసేపటికి చల్లారిపోయిన పోహాని మళ్లీ వేడి చేస్తున్న శబ్దం వినిపించింది.
“తిను.”
“నేను తినను అమ్మ.”
“తినాలి.”
“నాన్న వచ్చి ఇస్తేనే తింటాను.”
అమ్మ ఏమీ అనలేదు. ప్లేట్ తీసుకొచ్చి పక్కన నిల్చుంది.
“మా అమ్మ కదా నువ్వు. తిను. రేపు మాట్లాడతాడు మీ నాన్న. ఆయన గురించి నీకు తెలుసు కదా. ముందు ఇది తిను,” అని నోట్లో ఒక ముద్ద పెట్టింది.
ఆకలి కదా. ఆ పిల్ల ప్రాణం లేసొచ్చింది.
ఇంకో ముద్ద తినిపించింది. మళ్లీ ఇంకోటి. “అమ్మా, నేను తింటానులే. నువ్వు వెళ్లు.”
“లేదు. అంతా తినిపించి వెళ్తాను.”
ఒక స్పూన్. రెండు స్పూన్లు. మూడు స్పూన్లు. ప్లేట్ మొత్తం అయిపోయేదాకా అమ్మ అక్కడే నిల్చొని తినిపించింది. అమ్మకి పిల్ల ఎంత పెద్దదైనా, రెండేళ్ల పాపలాగే కనిపిస్తుంది.
అక్కడే, ఆ పోహా ముద్దల మధ్య, ఆ పిల్లకి మళ్లీ దేవుడు గుర్తొచ్చాడు.
కొద్దిసేపటి క్రితమే కదా ఆమె దేవుణ్ణి అడిగింది, “నా బాధ నీకు కనిపించట్లేదా? నాన్నకి ఈ చిన్న ప్రేమని ఎందుకు ఇవ్వలేకపోయావు?”
కానీ ఆమె అడగకుండానే సమాధానం వచ్చేసింది. నాన్న రాలేదు. దేవుడే వచ్చాడు. అమ్మ రూపంలో.
ఆమె బాధని అడగకుండానే చూసిన దేవుడు.
ఆమె ఆకలిని చెప్పకుండానే తెలుసుకున్న దేవుడు.
ఆమె మొండితనాన్ని కూడా ప్రేమగా అర్థం చేసుకున్న దేవుడు.
దేవుడు ఎక్కడో దూరంగా ఉండడు. మన చుట్టూనే ఉంటాడు. మనల్ని ప్రేమించే మనుషుల్లో ఉంటాడు. మన ఆకలిని మనకంటే ముందే గుర్తించే చేతుల్లో ఉంటాడు. మన బాధని మనం చెప్పకుండానే అర్థం చేసుకునే కళ్లలో ఉంటాడు.
ఈ రాత్రి నా కథలో ఆ దేవుడు మా అమ్మ.
Leave a comment